నెలసరి సమయంలో కూడా మహిళలు కోవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకోవచ్చు

మే 1st నుండి వ్యాక్సిన్ అనేది 18 సంవత్సరాలు దాటిన అందరికి వేయనున్నారు కాబట్టి, ఆడపిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. నెల సరికి 5 రోజుల ముందు, అలాగే 5 రోజుల తరువాత వరకు వ్యాక్సిన్ చేయించకూడదు.. ఎందుకనగా వ్యాక్సిన్ వేసినప్పుడు శరీరంలోని రోగనిరోధక శక్తి కొంత క్షీణింపజేసి మరలా పెంపొందిస్తుంది..కావున నెలసరి సమయంలో ఆడపిల్లలు శక్తిహీనంగా ఉంటారు కాబట్టి గమనించి వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుచున్నాం”, అని చెప్తూ ఒక పోస్ట్ ని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: నెలసరికి 5 రోజుల ముందు, అలాగే 5 రోజుల తరువాత వరకు కోవిడ్-19 యొక్క వ్యాక్సిన్ చేయించుకోకూడదు.

ఫాక్ట్:  నెలసరి సమయాల్లో కోవిడ్-19 వ్యాక్సిన్ చేయించుకోకూడదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారు ఎక్కడా కూడా చెప్పలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, సీడీసీ, మరియు ఐసీఎంఆర్ సంస్థలు కూడా నెలసరికి 5 రోజుల ముందు మరియు 5 రోజుల తరువాత వరకు కోవిడ్-19 వ్యాక్సిన్ చేయించుకోకూడదని చెప్పలేదు. అంతేకాదు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది ఫేక్ మెసేజ్ అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారు తెలిపారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్ లో వెతకగా, నెలసరికి 5 రోజుల ముందు మరియు 5 రోజుల తరువాత వరకు కోవిడ్-19 వ్యాక్సిన్ చేయించుకోకూడదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారు చెప్పినట్టు ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం దొరకలేదు. గర్భిణీ మరియు పాలిచ్చే మహిళలు టీకా తీసుకోకూడదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సలహా ఇచ్చినట్టు వారి అధికారిక డాక్యుమెంట్ లో చూడవొచ్చు; కానీ, నెలసరికి సంబంధించి ఎక్కడా ఎటువంటి ప్రస్తావన లేదు..

ప్రపంచ ఆరోగ్య సంస్థ, సీడీసీ, మరియు ఐసీఎంఆర్ వంటి సంస్థలు కూడా కోవిడ్-19 వ్యాక్సిన్ కి సంబంధించి నెలసరికి 5 రోజుల ముందు మరియు 5 రోజుల తరువాత వరకు కోవిడ్-19 వ్యాక్సిన్ చేయించుకోకూడదని ఎక్కడా ఎటువంటి సలహా ఇవ్వలేదు.

భారత్ లో ఇస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్లకు (కోవ్యాక్సిన్‌, కోవిషీల్డ్‌) సంబంధించి ఆయా కంపెనీలు (భారత్ బయోటెక్, సీరం ఇన్‌స్టిట్యూట్‌) విడుదల చేసిన డాక్యుమెంట్లలో కూడా నెలసరికి సంబంధించి ఎక్కడా సమాచారం లేదు. కావున, మహిళలు తమ నెలసరి సమయంలో కూడా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు.

అంతేకాదు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది ఫేక్ మెసేజ్ అని, 1 మే 2021 నుండి 18 ఏళ్లు పైబడిన వారందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారు ట్విట్టర్ లో పోస్ట్ చేసినట్టు ఇక్కడ చూడవొచ్చు.

ఇదే విషయం పై ఒకరు ట్విట్టర్ లో వివరణ కోరగా, నెలసరి సమయంలో టీకా తీసుకోవడం సురక్షితమేనని డాకర్ తనయ (‘Sexual Health Influencer of the year 2020’) తెలిపినట్టు ఇక్కడ చూడవొచ్చు. ఈ విషయం పై ఇతర వెబ్ సైట్లు ప్రచురించిన ఆర్టికల్స్ ని ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు.

కొంతమంది మహిళలు తమ నెలసరి మార్పులకు వ్యాక్సిన్ కారణం అయ్యుండవచ్చని అనుమానించగా, ‘నెలసరి మార్పులకు వ్యాక్సిన్స్ కారణమని చెప్పటానికి ఇప్పటివరకైతే ఎటువంటి డేటా లేదని’, యేల్ స్కూల్ అఫ్ మెడిసిన్ డాక్టర్లు చెప్పినట్టు ‘ది న్యూయార్క్ టైమ్స్’ వారు రిపోర్ట్ చేసారు.

ఒకవేల నిజంగా నెలసరి సమయంలో కోవిడ్-19 వ్యాక్సిన్ చేయించుకుంటే ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటే, ప్రభుత్వాలు దాని గురించి ప్రచారం చేసేవి. కానీ, ఎక్కడా ఏ ప్రభుత్వం కూడా అలాంటి ప్రకటనలు చేయలేదు.

చివరగా, నెలసరి సమయంలో కూడా మహిళలు కోవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకోవచ్చు.

The story first appeared here